శుభవార్త!
అతి త్వరలో కేంద్రం తెలంగాణా సమస్యకి ఒక శాశ్వత పరిష్కారాన్ని ప్రకటిస్తుందని శ్రీ అజాద్ గారు చెప్పేరు. సంతోషం!
అయితే ఇక్కడో చిన్న మెలిక. ప్రభుత్వం ప్రకటించేదే కాంగ్రెసు విధానంట !?
అంటే కాంగ్రెసు పార్టీగా తన విధానం ఏమిటో చెప్పకుండా ప్రభుత్వందే తనదీ అనటంలో అర్ధం ఏమిటి?
1) తెలంగాణా ( ప్రత్యేక రాష్ట్రం లేక రాష్ట్ర విభజన ) గురించి తన మనసులో మాట ఎప్పటికీ బయట పెట్టకుండా వుండటం.
2) ప్రభుత్వంలో తన మాటే తప్ప మిగిలిన పార్టీలది ఏమీ లేదని పరోక్షంగా చెప్పటం.
3) వికటిస్తే సంకీర్ణ పరిపాలన అవసరాల మీదకి నెట్టేసే అవకాశం వుంచుకోవటం.
4) నిర్ణయం ఏదైనా ఆంధ్రా తెలంగాణా ప్రాంతాలలో ప్రాంతీయ నాయకులచేత రెండు రకాలగానూ మాట్లాడించే సువర్ణావకాశం చేతులో వుంచుకోవటం. తత్ద్వారా ఎన్నికల్లో ప్రతిపక్షాల మీద పై చెయ్యి సాధించటం.
5) ఆఖరిదీ ముఖ్యమైనదీ- ఇప్పుడు తన అభిప్రాయం అని ఒకటి చెప్పితే ఇన్నేళ్ళూ తన అభిప్రాయాన్ని చెప్పకుండా కప్ప దాటు నడతని తనే బయట పెట్టుకున్నట్లు అవుతుంది కనుక దాన్ని కప్పి పుచ్చుకోవటం.
ఎక్కడైనా పార్టీలకి ముఖ్యమైన విషయాలమీద ఒక నిశ్చితాభిప్రాయం వుండాలి. దానిని ప్రజలకి తెలియజెయ్యాలి. ముఖ్యంగా అధికారంలో వున్నా పార్టీ ఏమనుకుంటోందో తమని గెలిపించిన ప్రజలకి తెలిసేలా ప్రకటించి ఆ తరువాతే చట్ట సభలో ఓ నిర్ణయానికి బిల్లు తో వెళ్ళాలి. సంకీర్ణ ప్రభుత్వం విషయంలో మెజారిటీ పార్టీకి ఈ బాధ్యత మరీ ఎక్కువ వుండాలి.
అలాంటిది పార్టీ పక్షాన ఎటువంటి ప్రకటనా చెయ్యకుండా ప్రభుత్వమే ఒక ప్రకటన చేసి అదే తమ పార్టీ అభిప్రాయం అని కాంగ్రెసు చేతులు దులిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదంటే దాని ప్రవర్తనమీద అనుమానాలు రేకెత్తటం అతి సహజం, అనివార్యం . వ్యవహారం అంత సజావుగా సాగించటం లేదు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అనిపించదూ?
ప్రభుత్వం మాట్లాడే మాటలన్నీ కాంగ్రెసు మాటలగానే తీసుకొవాలనేటట్లైతే కాంగ్రెసు మాటలని యూ పీ ఏ లో పార్టీలన్నీ ఏ విషయంలోనూ వ్యతిరేకించకుండా లేక విభేదించకుండానే వుంటున్నట్లేగా. అలాగే వాళ్ళ మాటలనీ కాంగ్రెసు వ్యతిరేకించటం లేదనేగా అర్ధం.
మరి అప్పుడు సీ డబ్ల్యూ జి, 2 జి వగైరా విషయాలల్లో కూడా వారికేమీ అభిప్రాయ బెధాలు లేకుండానే నడిపేరనేనా అర్ధం?
అలాగైతే మరి ఆ విషయాలలో తనకి ఏమీ తెలియదంటున్న కాంగ్రెసు మాటలు ఎలా నమ్మటం?
ప్రధాని మాటలలో విశ్వసనీయత ఏమిటి?
ఇలాటి చర్చ తలెత్తకుండా కాంగ్రెసు ఇదీ తమ విధానం అని ముందు ప్రకటించి ఆ తరువాత ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించటం మంచిది.
అది శ్రేయస్కరమూ గౌరవప్రదమూను!
అంతే కాక అది ఎవరో పార్టీ ప్రతినిధి నుండి కాక పార్టీ అధినేతనోటి నుండే వెలువడటం ఉచితం! అప్పుడే ఆ మాటకి విలువా ప్రాముఖ్యతా వుంటాయి.
లేకపోతే మళ్ళీ ఏ విషయలోనూ ఏ పార్టీ అధినేతనీ ప్రశ్నించే హక్కు కాంగ్రెసు శాశ్వతంగా కోల్పోతుంది!
ఆ పరిష్కారమేదో నిజంగానే అందరికీ అమోద యోగ్యమైనదే వస్తుందని ఆశిద్దాము.
అది కనిపెట్టిన వాడికి భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలన్నిటి లోనూ ఘన సన్మానాలు జరుపుతారన్న దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు.
సర్వే జనాస్సుఖినో భవంతు!
